
టీఎస్ రెడ్‌కో అధ్వర్యంలో శుక్రవారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ఇందనపొదుపు పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ది బెస్ట్ స్టేట్ అని ప్రశంశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “ఇటీవలే నేను కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాను. అది నిజంగా ఒక ఇంజనీరింగ్ వండర్. దాని వలన రాష్ట్రానికి శాస్వితంగా నీళ్ళ కొరత తీరిపోతుంది. పంటలకు అవసరమైనంతా నీళ్ళు అందుతాయి. అలాగే రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన హరితహారం పధకం కూడా అద్భుతంగా అమలవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కోల్పోయిన అటవీసంపదను ప్రత్యామ్నాయ ప్రాంతాలలో మళ్ళీ పెంచడం చాలా అభినందనీయం. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా రంగాలలో కూడా తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి సాధించింది. ఈవిధంగా అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్న తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. దీనికంతటికీ కారణం సిఎం కేసీఆర్ దూరదృష్టి, పట్టుదల, చిత్తశుద్ది అనే నేను చెప్పగలను. ఇందుకు నేను ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను,” అని అన్నారు.
అనంతరం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్రంలోని వివిద సంస్థలకు ఇందన పొదుపు పురస్కారాలను అందజేశారు.
తమిళనాడు బిజెపి అధ్యక్షురాలిగా పనిచేసి తెలంగాణ గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్ రాష్ట్రంలో బిజెపికి అనుకూలంగా రాజకీయాలు చేయకుండా ఈవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన ప్రభుత్వ పనితీరును ప్రశంశించడం గొప్ప విషయమే. మిగిలిన 5 ఏళ్ళు కూడా ఆమె ఇదేవిధంగా సహకరించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టి దూసుకుపోగలదు.