నేడు హైదరాబాద్‌ రానున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం హైదరాబాద్‌ రానున్నారు. రాష్ట్రపతి ఏటా శీతాకాలంలో హైదరాబాద్‌ వచ్చి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో వారం రోజులు బస చేసి దక్షిణాది రాష్ట్రాలలో పర్యటించడం ఆనవాయితీ. కనుక నేటి నుంచి డిసెంబర్ 28వరకు రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఈరోజు మధ్యాహ్నం డిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ వస్తున్నారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సిఎం కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు హకీంపేట విమానాశ్రయానికి వెళ్ళి రాష్ట్రపతికి సాదరంగా ఆహ్వానం పలుకుతారు.  

రాష్ట్రపతి రాక సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు హకీంపేట వై జంక్షన్‌ నుంచి, బొల్లారం చెక్‌పోస్ట్‌, నేవీ జంక్షన్‌, యాప్రాల్‌ రోడ్‌, హెలీపాడ్‌ వై జంక్షన్‌, బైసన్‌గేట్‌, లోతుకుంట వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించబడతాయి. 

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రపతి నిలయం చేరుకొంటారు. సిఎం కేసీఆర్‌, మంత్రులు తదితరులు రేపు ఉదయం రాష్ట్రపతి నిలయానికి వెళ్ళి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను మర్యాదపూర్వకంగా కలుస్తారు. ఆ తరువాత వివిద పార్టీల ప్రముఖులు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను మర్యాదపూర్వకంగా కలుస్తారు.

రాష్ట్రపతి గౌరవార్ధం ఈనెల 22న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాజ్‌భవన్‌లో విందు ఏర్పాటు చేస్తారు. ఆ సందర్భంగా ఆయన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (తెలంగాణ శాఖ) రూపొందించిన మొబైల్ యాప్‌ను ప్రారంభిస్తారు. 

మరుసటిరోజు అంటే డిసెంబర్ 23న పుదుచ్చేరి వెళ్ళి అక్కడ పాండిచ్చేరి యూనివర్సిటీ 27వ వార్షిక సదస్సులో పాల్గొంటారు. 

డిసెంబర్ 25న తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్ళి అక్కడ సముద్రతీరానికి కొంత దూరంలో గల వివేకానంద రాక్ మెమోరియల్ కేంద్రాన్ని సదర్శిస్తారు. 

డిసెంబర్ 27 సాయంత్రం తెలంగాణ మంత్రులు, సీనియర్ అధికారులు, ప్రముఖులు, విద్యావేత్తలు, ప్రముఖులకు రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి విందు ఏర్పాటు చేస్తారు. డిసెంబర్ 28 ఉదయం డిల్లీ బయలుదేరి వెళతారు.