బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌ ఓకేనా?

గతనెల 23న బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై వేగంగా ప్రయాణిస్తున్న ఒక కారు అదుపుతప్పి కింద పడిపోవడంతో దాని క్రింద నలిగి ఒక మహిళ చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఫ్లై ఓవర్‌ ప్రారంభించిన 20 రోజులకే వరుసగా రెండు ప్రమాదాలు జరుగడంతో అధికారులు ఫ్లై ఓవర్‌ను తాత్కాలికంగా మూసివేసి ప్రమాదాలకు కారణాలను తెలుసుకొనేందుకు ఒక నిపుణుల కమిటీని వేశారు. 

బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌ డిజైనింగ్‌లో కొన్ని లోపాలున్నాయని కానీ దాని నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేవని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఫ్లై ఓవర్‌ నిర్మాణం కోసం నగరం నడిబొడ్డున తగినంత భూసేకరణ చేయడం కష్టమనే ఉద్దేశ్యంతో తక్కువ పొడవులో ‘ఎస్’ ఆకారంలో రెండు పెద్ద మలుపులతో ఫ్లై ఓవర్‌ను నిర్మించడం వలననే ప్రమాదాలు  జరుగుతునట్లు నిపుణుల కమిటీ నివేదికలో పేర్కొంది. అయితే ఆ ప్రమాదాల నివారణకు కమిటీ కొన్ని పరిష్కార మార్గాలను కూడా సూచించింది. 

బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు మలుపుల వద్ద ‘రంబుల్ స్ట్రిప్స్’ ఏర్పాటు చేయాలని, ఫ్లై ఓవర్‌పై వాహనాలు గంటకు 40కిమీ మించి వేగంతో ప్రయాణించకుండా చర్యలు తీసుకోవాలని నిపుణుల కమిటీ సూచించింది. అలాగే ఫ్లై ఓవర్‌పై ప్రయాణిస్తున్న వాహనదారులు నగరసౌందర్యం చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నారని కనుక మలుపుల వద్ద ఫ్లై ఓవర్‌కు ఇరువైపులా బారీ తెరలు ఏర్పాటు చేయాలని సూచించింది. ఫ్లై ఓవర్‌పై ఎవరూ వాహనాలు నిలిపి సెల్ఫీలు, ఫోటోలు తీసుకోకుండా నిరోధించాలని సూచించింది. ఇవన్నీ ఖచ్చితంగా అమలుచేయగలిగితే బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై ప్రమాదాలు నివారించవచ్చునని నిపుణుల కమిటీ నివేదికలో పేర్కొంది. జీహెచ్‌ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్ వాటిపై అధికారులతో చర్చించి నిపుణుల కమిటీ సూచనల మేరకు బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా ఆదేశించారు. అవి పూర్తికాగానే త్వరలోనే మళ్ళీ బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై రాకపోకలకు నగర ప్రజలను అనుమతించనున్నారు.