మద్యం అమ్మకాలలో 6 శాతం కమీషన్: రేవంత్‌ రెడ్డి

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి సిఎం కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ సోమవారం ఓ బహిరంగలేఖ వ్రాశారు. “రాష్ట్రంలో కల్వకుంట్ల సేల్స్ ట్యాక్స్ (కేఎస్టీ) అమలవుతోంది. రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా కేసీఆర్‌ కుటుంబానికి 6 శాతం కమీషన్ ముట్టజెప్పాల్సిందే. తాజాగా మద్యం ధరల పెంపు విషయంలో కూడా ఒక ఎంపీ చెన్నై, డిల్లీలలో కూర్చొని మద్యం కంపెనీ ఓనర్లతో మాట్లాడి డీల్ సెటిల్ చేశారు. ఎక్కువ కమీషన్లు ఇచ్చే మద్యం బ్రాండ్లను తెరాస సర్కార్‌ స్వయంగా ప్రోత్సహిస్తోంది. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఎక్సైజ్ అండ్ ప్రొమోషన్ శాఖగా మారిపోయింది. అదే మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోంది. మద్యం ధరల పెంపు వెనుక ‘కేఎస్టీ’ ఉంది. దీనిపై సిబిఐ విచారణ జరిపితే నిజానిజాలు బయటకు వస్తాయి. ఒకవేళ సిబిఐ చొరవ తీసుకోకపోతే నేనే స్వయంగా హైకోర్టుకు వెళ్ళి పోరాడుతాను.

మద్యపానం కారణంగానే రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. మద్యం ధరలు పెంచి ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకోవాలనుకొని చూస్తోంది. తద్వారా రాష్ట్రంలో మహిళల భద్రతను పణంగాపెట్టడానికి వెనకడటంలేదని స్పష్టమవుతోంది. పైగా అధికధరలతో మద్యం కొనుగోలుదార్లను, మద్యం దుఖాణాల యజమానులను కూడా తెరాస సర్కార్‌ నిండా ముంచుతోంది. కనుక మద్యం ధరల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం  వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను,” అని రేవంత్‌ రెడ్డి లేఖ సారాంశం.