ఎంపీ అరవింద్ రాజీనామా చేస్తారా?

నిజామాబాద్‌ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ రాజీనామా చేయాలని రైతు ఐఖ్యవేదిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలలో తనను గెలిపిస్తే నెలరోజులలోగా పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని బాండ్ పేపర్‌పై వ్రాసి తమకు హామీ ఇచ్చారని, కానీ గెలిచి 7నెలలు కావస్తున్నా ఇంతవరకు ఆ హామీ నిలబెట్టుకోలేకపోయారని జిల్లాలో పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

పసుపు బోర్డు ఏర్పాటు, పసుపుకు మద్దతు ధర కోసం జిల్లాలోని పసుపు రైతుల ఐక్యకార్యాచరణ కమిటీ అధ్వర్యంలో సోమవారం ఉదయం మెండోరా మండలంలోని వెల్కటూరు నుంచి జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర కూడా ప్రారంభించారు. తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మాజీ ఎంపీ కవిత మూల్యం చెల్లించారని, ఇప్పుడు ధర్మపురి అరవింద్ కూడా మూల్యం చెల్లించవలసి వస్తుందని వారు హెచ్చరించారు. ఎన్నికల సమయంలో బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన ధర్మపురి అరవింద్ ఇప్పుడు బోర్డు అవసరం లేదన్నట్లు మాట్లాడటాన్ని పసుపు రైతులు తప్పుపట్టారు. ఆయన నెలరోజులలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే అదే ఆయన చెప్పే గొప్ప శుభవార్త అవుతుందని, బోర్డు ఏర్పాటు తప్ప వేరేదీ తమకు అంగీకారం కాదని పసుపు రైతుల సంఘం నేతలు స్పష్టం చేశారు. ఒకవేళ బోర్డు ఏర్పాటుచేయలేకపోతే ధర్మపురి అరవింద్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 


ఇక జగిత్యాల జిల్లా కేంద్రంలో కూడా రైతు ఐఖ్యవేదిక అధ్వర్యంలో నేడు పసుపు రైతులు ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ వరకు పాదయాత్ర నిర్వహించిన తరువాత జగిత్యాల-కరీంనగర్‌ రహదారిపై బైటాయించి కాసేపు రాస్తారోకో చేశారు. దాంతో బారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు నచ్చజెప్పడంతో వారు అక్కడి నుంచి నేరుగా ప్రజావాణి సమావేశానికి వెళ్ళి జిల్లా కేంద్రంలో పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం వారు కూడా నిజామాబాద్‌లో మొదలైన పసుపు రైతుల పాదయాత్రలో పాల్గొనేందుకు తరలివెళ్లారు. 

ఈ సందర్భంగా రైతు ఐఖ్యవేదిక నేతలు మాట్లాడుతూ, బిజెపి, తెరాసలు రెండూ కూడా తమతో చెలగాటం ఆడుతున్నాయని, వాటికి రాజకీయాలు కావాలో లేక రైతుల ప్రయోజనాలు కావాలో తేల్చుకోవాలని సూచించారు. తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని ఇచ్చిన హామీ ప్రకారం పసుపు బోర్డును ఏర్పాటు చేసి, తమ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని మాత్రమే కోరుతున్నామన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించరకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. 

పసుపుబోర్డు ఏర్పాటు సాధ్యం కాదని గతంలో ఎంపీ కవితే తేల్చి చెప్పారు. కానీ తనను గెలిపిస్తే నెలరోజులలోగా బోర్డు ఏర్పాటు చేయిస్తానని ధర్మపురి అరవింద్ హామీ ఇవ్వడంతో రైతులు ఆయనకు ఓట్లేసి గెలిపించారు. కానీ ఇప్పుడు ఆయన కూడా పసుపు బోర్డు ఆలోచన చాలా పాతదని నెలరోజులలో దానికంటే చాలా మెరుగైన ‘విధానం’ ప్రకటిస్తామని చెపుతున్నారు. అంటే ఆయన కూడా పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యం కాదని చెప్పుతున్నారని అర్ధమవుతోంది. బోర్డు ఏర్పాటు చేయలేకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని కూడా రైతులకు హామీ ఇచ్చారు కనుక మరిప్పుడు రాజీనామా చేస్తారా?