సమత నిందితులకు ఉరిశిక్ష?

గత నెల కుమురంభీంజిల్లా లింగాపూర్ మండలంలో ఎల్లాపటార్ గ్రామంలో హత్యాచారానికి గురైన సమత (మహిళ పేరును సమతగా పోలీసులు మార్చారు) కేసులో ప్రధాన నిందితుడు షేక్ బాబుతో సహా మరో ఇద్దరు నిందితులు షేక్ శాబోద్దీన్, షేక్ మఖ్దూంలను పోలీసులు సోమవారం ఫాస్ట్-ట్రాక్ కోర్టులో హాజరుపరిచారు. నేటి నుంచి ఈ కేసు విచారణ ప్రారంభమయ్యింది. ఈ కేసులో నిందితులు దోషులని నిరూపించే అన్ని సాక్ష్యాధారాలను పోలీసులు సిద్దం చేశారు. ఈ కేసులో మొత్తం 44 మందిని సాక్షులుగా ఛార్జ్-షీట్‌లో పేర్కొన్నారు. 

ఈ ఒక్క కేసు విచారణ కోసమే ప్రత్యేకంగా ఫాస్ట్-ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయబడినందున సాక్షులలో రోజుకు ఐదుగురు చొప్పున విచారణ జరిపి మూడు వారాలలోపే తీర్పు వెలువరించవచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఈ ఘటన నవంబర్ 24న ఎల్లాపటార్ గ్రామంలో జరుగగా పోలీసులు మూడు రోజులలోనే నిందితులను పట్టుకొన్నారు. నిందితులు ఆమెను సామూహిక అత్యాచారం చేయడమే కాక అతిక్రూరంగా హింసించి, గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాధితురాలు దళిత మహిళ కావడంతో హత్య, అత్యాచారం నేరాలకు సంబందించిన సెక్షన్స్ తో పాటు అట్రాసిటీ సెక్షన్ కింద కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో ఇటువంటి హత్యాచారఘటనలు పెరిగిపోతుండటంతో న్యాయవ్యవస్థలు త్వరగా విచారణ పూర్తిచేసి దోషులకు ఉరిశిక్షలు విధించాలని ప్రజలు కోరుతున్నందున న్యాయస్థానాలపై కూడా ఎంతోకొంత ఒత్తిడి ఉంటుంది. కనుక ఈ కేసులో దోషులకు ఉరిశిక్షలు పడే అవకాశం ఉందని భావించవచ్చు.