
తెరాస సర్కార్ వరుసగా రెండవసారి అధికారం చేపట్టిన తరువాత ఏడాది పాలన పూర్తి చేసుకొన్నందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సిఎం కేసీఆర్‌కు, మంత్రులకు అభినందనలు తెలియజేశారు. ఆ తరువాత ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు చేశారు.
గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 17,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉండేది. కేసీఆర్ అసమర్దత, అనాలోచిత నిర్ణయాల కారణంగా ఐదున్నరేళ్ళలోనే 3 లక్షల కోట్లు అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయింది. ఇక ఎన్నికలలో గెలిచేందుకు నిరుద్యోగభృతి, పంటరుణాల మాఫీ, పంటలకు మద్దతు ధరలు కల్పించడం, ధరల నియంత్రణ వంటి అనేక హామీలు గుప్పించారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఇంతవరకు వాటిని అమలుచేయలేదు. రాష్ట్రంలో విద్యా, వైద్యం పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, కిడ్నాపులు పెరిగిపోయాయి. కేవలం ఐదున్నరేళ్ళలోనే రాష్ట్రం పరిస్తితి అన్ని విధాలుగా దిగజారిపోయింది. రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితుల వలన తెలంగాణ ప్రతిష్ట మసకబారుతోంది,” అని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.