ఫాస్ట్-ట్యాగ్‌ గడువు పొడిగింపు

టోల్‌గేట్‌ల వద్ద రద్దీ కారణంగా సమయం వృధా కాకుండా నివారించేందుకు కేంద్రప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి ఫాస్ట్-ట్యాగ్‌ విధానాన్ని అమలుచేయబోతున్నట్లు ప్రకటించింది. కానీ దానిపై వాహన యజమానులకు అవగాహన లేనందున వాటిని అమర్చుకొనేందుకు డిసెంబర్ 15వరకు గడువు పొడిగించింది. 

ఎలక్ట్రానిక్ స్టిక్కర్ వంటి ఈ పరికరాన్ని జాతీయబ్యాంకులు, ఆన్‌లైన్‌లో అమెజాన్ స్టోర్స్ లో కొనుగోలు చేయవచ్చు. ఫాస్ట్-ట్యాగ్‌ను వాహనం ముందువైపు అద్దానికి అంటించుకోవలసి ఉంటుంది. అప్పుడు వాహనం టోల్‌గేట్‌ వద్దకు చేరుకొన్నప్పుడు అక్కడ అమర్చబడిన స్కానర్ దానిని గుర్తించి టోల్‌గేట్‌ ఫీజ్ కట్ చేసుకొంటుంది. కనుక ఇది వరకులాగా డబ్బులు చెల్లించేందుకు వాహనాలు గంటల తరబడి టోల్‌గేట్‌ల వద్ద వేచి చూడనవసరం ఉండదు. మొబైల్ ఫోన్స్ రీ-ఛార్జ్ చేసుకొంటున్నట్లే టోల్‌గేట్‌ ఫీజ్ చెల్లింపుల కోసం ఫాస్ట్-ట్యాగ్‌లను కూడా ఎప్పటికప్పుడు కొంత సొమ్ముతో రీ-ఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది. నిత్యం టోల్‌గేట్‌ల గుండా రాకపోకలు సాగించే వాహనయజమానులకు ఈ ఫాస్ట్-ట్యాగ్‌ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కనుక డిసెంబర్ 15లోగా వాటిని ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి లేకుంటే ఆ తరువాత నుంచి ప్రతీసారి టోల్‌గేట్‌ ఫీజుకు రెట్టింపు చెల్లించవలసి ఉంటుంది.