
ఆర్టీసీ కార్మికులకు శుభవార్త.. రేపటి నుంచి అందరూ సంతోషంగా విధులలో చేరవచ్చునని సిఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఎటువంటి షరతులు లేకుండా అందరినీ విధులలోకి తీసుకొంటున్నట్లు ప్రకటించారు. అలాగే ఆర్టీసీని ప్రైవేట్ పరమ్ చేయబోమని ప్రకటించారు. సమ్మె సమయంలో మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలలో ఒక్కరూ చొప్పున ప్రభుత్వోద్యోగం ఇస్తామని ప్రకటించారు. త్వరలోనే ఆర్టీసీ కార్మికులను ప్రగతి భవన్కు పిలిపించుకొని వారితో స్వయంగా మాట్లాడి వారి సమస్యలన్నిటినీ పరిష్కరిస్తానని సిఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
అయితే సమ్మెకు కారకులైన యూనియన్ లీడర్లను మాత్రం క్షమించబోనని తేల్చి చెప్పారు. ఆర్టీసీ మనుగడ కోసం సోమవారం నుంచి కిలోమీటరుకు 20 పైసలు చొప్పున ఛార్జీలు పెంచాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.
ఈ శుభవార్త కోసమే ఇన్నాళ్లుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఆర్టీసీ కార్మికులకు సిఎం కేసీఆర్ ప్రకటనతో చాలా ఊరట లభిస్తుంది. ఇంతకాలం ఆర్టీసీ కార్మికులను విధులలోకి తీసుకోవడానికి ప్రభుత్వం నిరాకరిస్తుండటంతో ఆగమ్యగోచరంగా మారిన తమ జీవితాలను చూసి తీవ్ర నిరాశానిస్పృహలకు లోనై ఉన్న ఆర్టీసీ కార్మికులకు సిఎం కేసీఆర్ తాజా ప్రకటనతో మళ్ళీ కొత్త ఉత్సాహం పుట్టుకువస్తుందని వేరే చెప్పనవసరం లేదు.