
అనేక నాటకీయ పరిణామాల తరువాత మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాక్రే బుదవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. దాదార్‌లోని శివాజీ స్టేడియంలో ప్రజలు, మిత్రపక్ష నేతలు, సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన అతిరధ మహారధుల సమక్షంలో ఉద్ధవ్ థాక్రే ఈరోజు సాయంత్రం 6.40 గంటలకు మహా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. 1966లో శివసేన పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి నేటివరకు ఎవరూ ముఖ్యమంత్రి పదవి చేపట్టలేకపోయారు. మొదటిసారిగా ఉద్ధవ్ థాక్రే ఆ పదవి చేపట్టారు. ఆయనతో పాటు మిత్రపక్షాలైన ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన చెరో ముగ్గురూ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి మూడు రోజులు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్రప్రభుత్వం తరపున కేంద్రమంత్రి రాందాస్ అధవాలే, కాంగ్రెస్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, అహ్మద్ పటేల్, ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాక్రే, డిఎంకె అధినేత స్టాలిన్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులు, ఇంకా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ప్రమాణస్వీకారం అనంతరం ఈరోజు రాత్రి 8 గంటలకు తొలి మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లు శివసేన ప్రతినిధులు తెలిపారు.