
ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి బేషరతుగా విధులలో చేరేందుకు వచ్చినా తీసుకోకుండా పోలీసుల చేత కార్మికులపై లాఠీ ఛార్జీ చేయించడం, అరెస్టులు చేయించడాన్ని నిరసిస్తూ సూర్యాపేట డిపోకూ చెందిన కండక్టర్ లునావత్ కృష్ణానాయక్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు.
సిఎం కేసీఆర్ను ఉద్దేశ్యించి ఒక లేఖ కూడా వ్రాశారు. ఆ లేఖలో... “తెలంగాణ వస్తే ఆత్మగౌరవంతో జీవించవచ్చనుకొన్నాము. అందుకే మీ నాయకత్వంలో తెలంగాణ సాధన కోసం అందరం పోరాడాము. కానీ ఆనాటి ఉద్యమనాయకుడు కేసీఆరే ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల పట్ల చాలా చులకనభావంతో వ్యవహరిస్తుండటం చూసి మా ఆత్మాభిమానం దెబ్బతింది. ముప్పై మంది ఆర్టీసీ కార్మికులు చనిపోతే కనీసం సానుభూతితో స్పందించే హృదయం మీకు లేకపోయింది. మీ మాయమాటలు నమ్మి మోసపోయామని అర్ధమైంది. ఆర్టీసీ సమ్మెతో మీ నిజస్వరూపం బయటపడింది. మహిళా కండక్టర్లు ఏం తప్పు చేశారని వారిని పోలీసుల చేత లాఠీలతో కొట్టించి అరెస్టులు చేయించారు?ఆర్టీసీ కార్మికుల పట్ల మీరు ఇంత చులకనగా వ్యవహరిస్తుంటే ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని చంపుకొని ఇంకా ఉద్యోగం చేయలేను. కనుక ఉద్యోగంలో నుంచి మీరు నన్ను పీకడం ఏమిటి? నేనే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. కనుక తక్షణం నా రాజీనామాను ఆమోదించి పదవీవిరమణ తరువాత నాకు రావలసిన సొమ్మును ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కారణంగా సంక్షేమ పధకాల నుంచి నన్ను, నా తల్లితండ్రులను మినహాయించరని ఆశిస్తున్నాను. నా తల్లితండ్రులకు పెన్షన్, నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వగైరాలు ఇచ్చి తెలంగాణలో ఆత్మగౌరవంతో జీవించేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నాను,” అని లేఖ సారాంశం.
ఇప్పటి వరకు ఆర్టీసీ కార్మికులు తమను విధులలో తీసుకోమని డిపో మేనేజర్లను ప్రాధేయపడటమే అందరూ చూశారు. కానీ మొట్టమొదటిసారిగా ఒక ఆర్టీసీ కార్మికుడు తన ఆగ్రహావేశాలను రాజీనామా రూపంలో వ్యక్తం చేయడం విశేషం.