
మహారాష్ట్ర బిజెపికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన సుప్రీం ధర్మాసనం మహా సంక్షోభంపై ఈరోజు ఉదయం తీర్పు వెలువరించింది. మహారాష్ట్ర గవర్నర్ బిజెపికి శాసనసభలో బలనిరూపణ కోసం నవంబర్ 30 వరకు గడువు ఇవ్వగా సుప్రీంకోర్టు దానిని తగ్గించి బుదవారం సాయంత్రంలోగా బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించింది. సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించాలనే బిజెపి విజ్ఞప్తిని తిరస్కరించింది. బలనిరూపణ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించింది. రేపు సాయంత్రంలోగా ఎమ్మెల్యేలందరూ ప్రమాణస్వీకారం చేయాలని, ప్రోటెం స్పీకర్ (తాత్కాలిక సభాపతి) అధ్వర్యంలో బలనిరూపణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా వాటిలో బిజెపి 105, శివసేన(56), ఎన్సీపీ (54), కాంగ్రెస్ పార్టీ(44) మంది ఎమ్మెల్యేలున్నారు. వారుకాక మరో 29మంది ఇతరులున్నారు. ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి కనీసం 146 మంది ఎమ్మెల్యేలు అవసరం కానీ బిజెపి వద్ద ప్రస్తుతం సుమారు 115-120 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్లు సమాచారం. కనుక రేపటిలోగా మిగిలినవారిని కూడగట్టుకోవాలి లేకుంటే ఫడ్నవీస్ ప్రభుత్వం కూలిపోవచ్చు. కనుక ఎన్సీపీ, శివసేన లేదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి బిజెపి విశ్వప్రయత్నాలు చేస్తోంది.
అయితే ఆ మూడు పార్టీలు కలిసి తమ వద్ద ఉన్న 162 మంది ఎమ్మెల్యేలను నిన్న రాత్రి ముంబైలో ఒక ప్రముఖ హోటల్లో మీడియా ముందు ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ఏర్పాటుచేయగల శక్తి తమకే ఉందని స్పష్టం చేశాయి.