రేపు సుప్రీంకోర్టు మహా తీర్పు

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత రేపు ఉదయం తుది తీర్పు వెలువరిస్తామని తెలిపింది. 

కేంద్రప్రభుత్వం, తరపు వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, మహారాష్ట్ర గవర్నర్‌ రాజ్యాంగం ప్రకారమే నడుచుకొన్నారని, ముందుగా బిజెపిని, ఆ తరువాత శివసేన, ఎన్సీపీలను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారని, అవి విఫలం అవడంతో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారని వాదించారు. 

అనంతరం ఎన్సీపీ శాసనసభాపక్ష నాయకుడు అజిత్ పవార్ 54 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు లేఖను ఇచ్చినందునే రాష్ట్రపతి పాలనను ఎత్తివేయమని సిఫార్సు చేసి, బిజెపి, ఎన్సీపీ నేతల చేత గవర్నర్‌ ప్రమాణస్వీకారాలు చేయించారని వాదించారు. పైగా గవర్నర్‌ విచక్షణాధికారాలను ప్రశ్నించే హక్కు సుప్రీంకోర్టుకు లేదని వాదించారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తరపున వాదించిన ముకుల్ రోహత్గీ శివసేన పంతం వలననే రాష్ట్రంలో ఈ పరిస్థితులు నెలకొన్నాయని, ఎన్సీపీ ఎమ్మెల్యేలు బిజెపికి మద్దతు ఇచ్చారని ఆ విషయం ఎన్సీపీ కూడా దృవీకరిస్తోందని కనుక ఫడ్నవీస్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించడాన్ని ఎవరూ తప్పు పట్టలేరని వాదించారు. 

అజిత్ పవార్ తరపున వాదించిన మనీందర్ సింగ్, ఎన్సీపీ శాసనసభాపక్ష నాయకుడు హోదాలో అజిత్ పవార్ బిజెపికి మద్దతు ఇచ్చారని దానిని ఏవిధంగా తప్పు పట్టగలరని ప్రశ్నించారు. ఆయన నిర్ణయం చట్టబద్దంగానే ఉందని వాదించారు. 

శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల తరపున ప్రముఖ న్యాయవాదులు కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వీలు వాదించారు.  అజిత్ పవార్‌ను పార్టీ నుంచి, పదవి నుంచి తొలగించినందున ఆయన నిర్ణయాలను ఎన్సీపీకి కట్టుబడి ఉండవలసిన అవసరం లేదని, కనుక బిజెపికి ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు ఇవ్వడం లేదని వాదించారు. బిజెపికి నిజంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత బలం ఉన్నట్లయితే అర్ధరాత్రిపూట రాష్ట్రపతి పాలనను ఎత్తివేయించి, తెల్లవారుజామున హడావుడిగా ప్రమాణస్వీకారాలు చేయవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. బిజెపికి ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం ఉందని చెప్పుకొంటోంది కనుక తక్షణమే శాసనసభలో బలనిరూపణ చేసుకోవలసిందిగా ఆదేశించాలని వారు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.