ఉత్తరాది రాష్ట్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి?

త్వరలో తెలంగాణకు కాంగ్రెస్‌కు కొత్త ఇన్-ఛార్జ్, కొత్త పిసిసికి కొత్త అధ్యక్షుడు నియమితులు కాబోతున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ రాంచంద్ర కుంతియా స్థానంలో రాజీవ్ శంకర్ రావు సతావ్ (మహారాష్ట్ర), గౌరవ్ గగోయ్ (అసోం), ఆర్‌పీఎన్ సింగ్ (ఝార్ఖండ్)లలో ఎవరో ఒకరిని నియమించనున్నట్లు సమాచారం. 

పిసిసి అధ్యక్ష పదవికి టికాంగ్రెస్‌లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌ రెడ్డి, జగ్గారెడ్డి, వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ తదితరులు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. వారిలో ఎవరో ఒకరికి అధ్యక్ష పదవి అవకాశం లభించవచ్చు. 

ఇక పిసిసి అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా నియమించి, ఉత్తరాది రాష్ట్రాలలో ఏదో ఒక రాష్ట్రానికి కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్-ఛార్జ్ గా నియమించవచ్చునని తాజా సమాచారం. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడుకి ప్రభుత్వంలో చాలా పలుకుబడి, ప్రాధాన్యత ఉంటాయి కనుక అప్పుడు ఆ పదవి కోసం చాలా మంది పోటీ పడటం సహజమే. కానీ ఫిరాయింపుల కారణంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా కనిపిస్తున్నప్పుడు కూడా పిసిసి అధ్యక్ష పదవికి కాంగ్రెస్ నేతలు పోటీ పడుతుండటమే విశేషమే. తమకు అవకాశం కల్పిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని పోటీలో ఉన్నవారందరూ కాంగ్రెస్‌ అధిష్టానానికి హామీ ఇస్తున్నారు. 

అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో పిసిసి పగ్గాలు చేపట్టబోయే వ్యక్తి ఒకపక్క తెరాస సర్కార్‌ను..దాని ఒత్తిళ్ళను ఎదుర్కొంటూనే, మరోపక్క తమలో తాము కుమ్ములాడుకొంటున్న కాంగ్రెస్‌ నేతలందరినీ కలుపుకుపోతూ పార్టీని బలోపేతం చేసుకోవలసి ఉంటుంది. కనుక ఇప్పుడు పిసిసి పగ్గాలు ఎవరు చేపట్టినా అది వారికి ఎంతమాత్రం పూలపాన్పు కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి తెరాసను ఎదుర్కొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం సాధించగల గొప్ప మొనగాడు కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారో చూడాలి.