ఆర్టీసీ జేఏసీ కార్మికులను ఆదుకోగలదా?

ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “మేము బేషరతుగా సమ్మె విరమించి విధులలో చేరేందుకు సిద్దపడినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరం. ప్రభుత్వం స్పందించలేదు కనుక మా ప్రతిపాదనను ఆర్టీసీ యాజమాన్యంకు పంపిస్తాము. చట్టప్రకారం ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయడానికి వీలులేదు కనుక హైకోర్టు తీర్పు, ప్రభుత్వం నిర్ణయాలను చూసి ఆర్టీసీ కార్మికులు భయపడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం స్పందించేవరకు సమ్మె కొనసాగిస్తాము. ఆర్టీసీ జేఏసీ మళ్ళీ శనివారం మరోసారి సమావేశమయ్యి భవిష్య కార్యాచరణపై నిర్ణయం తీసుకొంటుంది,” అని అన్నారు. 

ఇంతకాలం ఆయన నాయకత్వంపై నమ్మకం ఉంచే 48,000 మంది ఆర్టీసీ కార్మికులు, ఆరు యూనియన్లు 50 రోజులుగా సమ్మె చేస్తున్నారు. సిఎం కేసీఆర్‌ రెండుసార్లు విధులలో చేరేందుకు అవకాశం ఇచ్చినప్పటికీ లొంగిపోకుండా అందరూ కలిసికట్టుగా నిలబడ్డారు. కానీ ఆర్టీసీ జేఏసీ పోరాటం విఫలమైంది. కనుక ఇంకా సమ్మెను కొనసాగించమని ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్పదలచుకొంటే రెండు నెలలుగా జీతాలు లేక అల్లాడిపోతున్న ఆర్టీసీ కార్మికులను ఆర్ధికంగా ఆదుకోవలసి ఉంటుంది. కానీ అది సాధ్యం కాదు కనుక ఆర్టీసీ కార్మికులు తమ కుటుంబపోషణ కోసం తప్పనిసరిగా ఏదో ఒక పని వెతుక్కోక తప్పదు. ఆర్టీసీ కార్మికులకు ఇంతకంటే వేరే దారి లేదు.