తెలంగాణకు ఇండియా టుడే అవార్డ్

ప్రముఖ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంగ్లీష్ మీడియా సంస్థ ఇండియా టుడే ప్రతీ ఏడాది దేశంలో రాష్ట్రాల పనితీరుపై సర్వే చేసి అవార్డులు ఇస్తుంటుంది. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రానికి ఆ అవార్డు లభించింది. ఇండియా టుడే నిర్వహించిన ‘స్టేట్ ఆఫ్ ది స్టేట్స్’ సర్వేలో తెలంగాణ రాష్ట్రం ‘మోస్ట్ ఇంప్రూవేద్ స్టేట్ ఇన్ గవర్నెన్స్-2019’ అవార్డు సొంతం చేసుకొంది. శుక్రవారం డిల్లీలో ఐటీసీ మౌర్యహోటల్‌లో జరిగిన ఈ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం తరపున ఎంపీ కే.కేశవరావు కేంద్రమంత్రి ప్రకాష్ జవాడేకర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకొన్నారు. 

ఈ సందర్భంగా కే.కేశవరావు మాట్లాడుతూ, “తెలంగాణ ఏర్పడిన కొత్తలో రాష్ట్రంలో అనేకానేక సమస్యలు ఉండేవి. కానీ సిఎం కేసీఆర్‌ దూరదృష్టి, కార్యదక్షత, పట్టుదల కారణంగా ఆ సమస్యలన్నిటినీ అధిగమించడమే కాకుండా ఐదున్నరేళ్ళలోనే తెలంగాణ రాష్ట్రం దేశంలో మిగిలిన రాష్ట్రాల కంటే అన్ని విధాలా అభివృద్ధి సాధించగలిగేలా చేశారు. ప్రజల కష్టానష్టాలను బాగా ఎరిగిన సిఎం కేసీఆర్‌ వారి అవసరాలకు తగ్గట్లుగా పధకాలు రూపొందిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు. సిఎం కేసీఆర్‌ స్వయంగా రూపొందించి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పధకాలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పధకాలు ఒక్కటైనా అందుకొని కుటుంబం లేదంటే అతిశయోక్తి కాదు,” అని అన్నారు.