4.jpg)
పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవి నుంచి తప్పుకోవాలనుకొంటున్నందున ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడుని నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఆ రేసులో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఆనాడు ఇందిరా గాంధీ బడుగుబలహీనవర్గాలకు ప్రధాన్యం ఇచ్చినట్లే ఇప్పుడు సోనియా గాంధీ కూడా మాకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకొంటున్నాను. ఇంతకాలం అగ్రకులాలవారే ఆ పదవిని చేపడుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి బీసీలు సారధ్యం వహించినప్పుడే ఎక్కువగా మేలు జరుగుతోందనే సంగతి అందరూ గుర్తుపెట్టుకోవాలి. కనుక మాకోసం కాకపోయినా పార్టీ శ్రేయసు కోసమైన అగ్రకులాల నేతలందరూ ఈసారి బీసీలకు అవకాశం కల్పించేందుకు సహకరించాలి.
నాకు ఎంతో రాజకీయ అనుభవం ఉంది. ప్రజలలో మంచి పేరు ఉంది. తెరాసను ఎదుర్కొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగల శక్తిసామర్ధ్యాలున్నాయి. వాటినే చూడాలి తప్ప నా వయసును కాదు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియాగాంధీకి కృతజ్ఞతగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావలసి ఉంది. నాకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే రాష్ట్రంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తాను. నేను బ్రతికి ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. ఎన్నటికీ పార్టీని వీడను,” అని అన్నారు.