అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌గా వెంకట్ రెడ్డి

అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్‌ విజయారెడ్డి సజీవదహనం తరువాత ఆమె స్థానంలో పనిచేసేందుకు అందరూ భయపడుతున్నారు. సరూర్‌నగర్‌ తహశీల్దార్‌ శ్రీనివాస్ రెడ్డి ఇన్-ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించడానికి నిరాకరించడంతో ప్రభుత్వం షేక్‌పేట తహసీల్దార్‌  వెంకట్ రెడ్డిని అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్‌గా నియమిస్తూ బుదవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వానికి మరో సమస్య ఎదురైంది. విజయారెడ్డి సజీవదహనం జరిగినప్పటి నుంచి రెవెన్యూ ఉద్యోగులు ఆ కార్యాలయంలో పనిచేయడానికి నిరాకరిస్తున్నారు. తహశీల్దార్‌ కార్యాలయాన్ని వేరే చోటికి మార్చాలని పట్టుపడుతున్నారు. కనుక స్థానికంగా మరో భవనాన్ని అధికారులు ఎంపిక చేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్న వెంకట్ రెడ్డి దానిని పరిశీలించిన తరువాత అందరికీ ఆమోదయోగ్యమైతే దానిలోకి తహశీల్దార్‌ కార్యాలయాన్ని తరలిస్తారు.