
సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరత్ అరవింద్ బోబ్డే ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ ఎస్.ఏ.బోబ్డే చేత ప్రమాణస్వీకారం చేయించారు. జస్టిస్ బాబ్డే 17 నెలల పాటు ఈ పదవిలో కొనసాగి 2021 ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు.
జస్టిస్ ఎస్.ఏ.బోబ్డే 1956లో మహారాష్ట్రలోని నాగపూర్లో జన్మించారు. నాగపూర్లో ఉన్న బాంబే హైకోర్టు బెంచిలో 21 ఏళ్ళు న్యాయవాదిగా చేశారు. 2000లో బాంబే హైకోర్టు అధనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012 నుంచి 2013 వరకు మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 2013 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో జస్టిస్ బాబ్డే అత్యంత సీనియర్ అయినందున ఈ అత్యున్నత పదవిని చేపట్టే అవకాశం లభించింది.