నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 23వరకు ఇవి కొనసాగుతాయి. కనుక ఆనవాయితీ ప్రకారం పార్లమెంటు సమావేశాలకు ముందు కేంద్రప్రభుత్వం ఆదివారం డిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. 

ఈ సమావేశానికి బిజెపి, కాంగ్రెస్‌లతో సహా మొత్తం 27 పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటు సమావేశాలలో చర్చించాల్సిన అంశాలపై వారు చర్చించారు. ప్రతిపక్షాలు సూచించిన అన్ని అంశాలపై పార్లమెంటులో చర్చించి, సమాధానాలు చెప్పడానికి తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రధాని నరేంద్రమోడీ వారికి హామీ ఇచ్చారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించవలసిందిగా ప్రతిపక్షాలను కోరారు. 

బిజెపి అజెండాలో ఉన్న ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్...ఇలా ఒక్కో అంశాన్ని పార్లమెంటు చేత వరుసగా ఆమోదింపజేసుకొంటున్న కేంద్రప్రభుత్వం ఈసారి సమావేశాలలో ఉమ్మడి పౌరస్మృతి, పౌరసత్వ బిల్లు, దేశమంతటా ఎనార్సీ అమలు బిల్లులతో పాటు మరో 30కి పైగా బిల్లులు ఈసారి పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది.

ఈసారి పార్లమెంటు సమావేశాలలో ఆర్ధిక మందగమనం, జమ్ముకశ్మీర్‌లో నేతల గృహనిర్బందం, మాజీ ఆర్ధికమంత్రి పి.చిదంబరం అరెస్ట్ తదితర అంశాలతో పాటు , కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టబోయే కీలక బిల్లులపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని గట్టిగా నిలదీయబోతున్నాయి. 

ఇక తెరాస ఎంపీలు తెలంగాణ రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల గురించి పార్లమెంటులో మాట్లాడనుండగా, ముగ్గురు కాంగ్రెస్‌, నలుగురు బిజెపి ఎంపీలు ఆర్టీసీ సమ్మె, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు, మరణాలు, తహశీల్దార్‌ విజయారెడ్డి సజీవదహనం తదితర సమస్యల గురించి పార్లమెంటులో ప్రస్తావించే అవకాశం ఉంది.