అక్టోబర్ 5 నుంచి ఆర్టీసీ సమ్మె మొదలైంది. కానీ సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం కటిన వైఖరితో వ్యవహరిస్తున్నందున 41 రోజులుగా సమ్మె కొనసాగుతూనే ఉంది. దాంతో ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్నారు. కొందరు కార్మికులు నిరాశ నిస్పృహలతో చనిపోతున్నారు. ఈ 41 రోజులలో 28 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం విస్మయం కలిగిస్తోంది. సమ్మె ముగింపుకు ఇప్పుడు ఆర్టీసీ కార్మిక సంఘాలు సిద్దంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో సమ్మెను కొనసాగించవలసి వస్తోంది.
మహబూబాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఆవుల నరేశ్ (48) నిన్న పురుగుల మందు త్రాగి చనిపోయాడు. ఆయన అంత్యక్రియలకు హాజరై నివాళులు అర్పించిన ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి, “ఆర్టీసీ కార్మికులు ధైర్యం కోల్పోవద్దు. ఆత్మహత్యలు చేసుకోవద్దు. ధైర్యంగా పోరాడి మన సమస్యలను పరిష్కరించుకొందాం. ఈ పోరాటంలో తప్పకుండా మనమే విజయం సాధిస్తాం,” అని ధైర్యం చెప్పారు.
అటువంటి సమయంలో అశ్వధామరెడ్డి ఆవిధంగా మాట్లాడటమే సబబు. లేకుంటే తోటి కార్మికుడి మృతితో విషాదంలో మునిగిపోయిన ఆర్టీసీ కార్మికులు మరింత దిగులుచెందుతారు. కానీ ఇంకా సమ్మెను కొనసాగించడంపై పునరాలోచించుకొంటే చాలా మంచిది. ఎందుకంటే కనుచూపుమేర ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం కనబడటం లేదు. ఆర్ధిక సమస్యల కారణంగా ఆర్టీసీ కార్మికులు ఇంకా ఎక్కువ కాలం సమ్మెను కొనసాగించే స్థితిలో లేరనేది నిజం. సమ్మె కొనసాగితే ఏమవుతుందో అందరూ చూస్తూనే ఉన్నారు. పోయిన ప్రాణాలను ఎలాగూ వెనక్కు తీసుకురాలేరు కనుక ఇంకా మరికొన్ని ప్రాణాలు పోకుండా ఉండాలంటే అశ్వధామరెడ్డితో సహా ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించుకొని తక్షణం ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. అది సమ్మె విరమణ అయినా మంచిదే. ప్రాణాల కంటే పంతాలు ముఖ్యం కాదని ఆర్టీసీ జేఏసీ నేతలు, రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రహిస్తే మంచిది.
కాదని పంతాలతో ముందుకు సాగితే ఆర్టీసీ కార్మికుల కుటుంబాల పరిస్థితులు మరింత దయనీయంగా మారుతాయి. ఆ కారణంగా మరెంతో మంది ప్రాణాలు కోల్పోవచ్చు. కనుక ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల మానవతాదృక్పదంతో వ్యవహరిస్తూ ఇరువర్గాలకు గౌరవప్రదంగా ఉండేవిధంగా రాజీపడి ఆర్టీసీ కార్మికులను కాపాడితే అందరూ హర్షిస్తారు. ఇకనైనా ఈ సమస్య ఇక్కడితో ముగుస్తుంది. లేకుంటే సమ్మె ముగిసేనాటికి బహుశః టిఎస్ ఆర్టీసీలో ఒక్కరు కూడా మిగలకపోవచ్చు.