తెరాస సర్కార్‌ను కూల్చబోము: లక్ష్మణ్

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ బుదవారం మీడియాతో మాట్లాడుతూ, “కొంతమంది తెరాస ఎమ్మెల్యేలు మాతో టచ్చులో ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు మాకు చాలా అనుకూలంగా ఉన్నాయి. కానీ మేము తెరాస సర్కార్‌ను కూలద్రోసి అడ్డుదారిలో అధికారంలోకి రావాలనుకోవడం లేదు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకొని వచ్చే ఎన్నికలలో తెరాసను ఓడించి అధికారంలోకి వస్తాము. 

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల ఫలితాలు తెరాసకు అనుకూలంగా ఉంటాయని మేము ముందే ఊహించాము. కానీ మున్సిపల్ ఎన్నికలలో తెరాసను ఎదుర్కోవడానికి మేము సిద్దంగా ఉన్నాము. వాటిలో మా సత్తా నిరూపించుకొంటాము.   

ఆర్టీసీ సమ్మెతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాల గురించి మేము ఎప్పటికప్పుడు మా అధిష్టానం ద్వారా కేంద్రప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఆర్టీసీకి ఇండియన్ ఆయిల్ కంపెనీ 54 పెట్రోల్ బంకులను కేటాయిస్తే వాటన్నిటినీ తెరాస సర్కార్‌ ఒకే వ్యక్తికి కట్టబెట్టిన విషయం మేము పెట్రోలియంమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఫిర్యాదు చేస్తాం.  

సిఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారింది. కేసీఆర్‌ రెండవసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన గ్రాఫ్ పడిపోతుంటే, అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ధైర్యంగా అమలుచేస్తున్న కారణంగా ప్రధాని నరేంద్రమోడీ గ్రాఫ్ నానాటికీ పెరుగుతోంది. అందుకే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలలో ప్రజలు బిజెపివైపు మొగ్గు చూపుతున్నారు. డిసెంబర్ నెలలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడి నియామకం జరుగుతుంది. మా అధిష్టానం నిర్ణయమే మాకు శిరోధార్యం,” అని కె.లక్ష్మణ్‌ చెప్పారు.