
అయోధ్య-బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తుదితీర్పుపై మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయోధ్యలో 2.77 ఎకరాలను రామాలయానికి కేటాయిస్తూ, అందుకు బదులుగా వేరే ప్రాంతంలో మసీదు నిర్మాణానికి వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాలను కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
సుప్రీంతీర్పు సుప్రీమే కానీ అమోఘం కాదని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఇది యజమాన్యపు హక్కు కోసం జరిగిన న్యాయపోరాటమని కనుక తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చే 5 ఎకరాల భూమి తమకు అవసరం లేదన్నారు.
అసదుద్దీన్ ఓవైసీ చేసిన ఈ వ్యాఖ్యలపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును కించపరుస్తూ మాట్లాడిన అసదుద్దీన్ ఓవైసీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
దీనిపై అసదుద్దీన్ ఓవైసీ మళ్ళీ స్పందించారు. మంగళవారం హైదరాబాద్ దారుస్సలాంలో మీడియాతో మాట్లాడుతూ, “రాజ్యాంగం ప్రకారం నాకు భావప్రకటన హక్కు ఉంది. కనుక సుప్రీంకోర్టు తీర్పుపై రాజ్యాంగబద్దంగానే స్పందించాను తప్ప నేనేమీ తప్పుగా మాట్లాడలేదు. కనుక కేసులకు భయపడబోను. సుప్రీం తీర్పుపై బిజెపి, ఆర్‌ఎస్ఎస్ లను సంతోషపరిచేవిదంగా మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. నాపై ఎవరు ఎంత విషం కక్కినా, కేసులు పెట్టుకొన్నా నేను భయపడను,” అని అన్నారు.