మహారాష్ట్రలో రాష్ట్రపతిపాలన విధింపు

మహారాష్ట్రలో నేటి నుంచి రాష్ట్రపతిపాలన విధించబడింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఇప్పటికీ మూడు వారాలయినప్పటికీ బిజెపి, శివసేన, కాంగ్రెస్‌, ఎన్‌స్పీలలో ఏదీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడంతో గవర్నర్‌   భగత్ సింగ్ కోష్యారీ సిఫార్సు మేరకు కేంద్రప్రభుత్వం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని నిర్ణయించింది. దానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వెంటనే ఆమోదముద్ర వేశారు. కనుక మంగళవారం నుంచి మహారాష్ట్రలో 6 నెలలపాటు రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. అయితే ఒకవేళ ఏ పార్టీలైనా కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లయితే రాష్ట్రపతి పాలన తొలగిస్తామని కేంద్రప్రభుత్వం తెలియజేసింది. కాంగ్రెస్‌, శివసేన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు తగినంత సమయం సంపాదించుకోవడం కోసమే కేంద్రప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించిందని శివసేన, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి.  

బిజెపికి మూడు రోజులు సమయం ఇచ్చిన గవర్నర్‌ భగత్ సింగ్ కోష్యారీ, శివసేనకు 48 గంటలు ఇచ్చేందుకు నిరాకరించారు. కనుక తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ తగినంత సమయం ఇవ్వలేదంటూ శివసేన సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ వేసింది. దానిపై సుప్రీంకోర్టు బుదవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టు శివసేన వాదనలతో ఏకీభవించి తగినంత సమయం ఇవ్వాలని ఆదేశించినట్లయితే మళ్ళీ కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన, బిజెపిల మద్య నాలుగు స్తంభాలాట మొదలవుతుంది.