మహరాష్ట్రలో ఏమి జరుగుతోంది?

మహరాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 24న వెలువడ్డాయి. కానీ మిత్రపక్షాలుగా పోటీ చేసిన బిజెపి, శివసేనల మద్య ముఖ్యమంత్రి పదవికోసం ప్రతిష్టంభన ఏర్పడటంతో ఇంతవరకు ప్రభుత్వం ఏర్పాటుకాలేదు. కనుక రాజ్యాంగ నిబందనల ప్రకారం 105 సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ భగత్ సింగ్ కోషియారి ఆహ్వానించారు. కానీ శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీలు బిజెపికి మద్దతు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో, తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని మహారాష్ట్ర మాజీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్‌కు ఆదివారం తెలియజేశారు. 

కనుక బిజెపి తరువాత 56 సీట్లు గెలుచుకొని రెండవ పెద్దపార్టీగా నిలిచిన శివసేనను ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా గవర్నర్‌ ఆహ్వానించారు. సోమవారం రాత్రి 7.30లోపుగా ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టతనీయాలని గడువు విధించారు. 

ఈసారి ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని శివసేన అధినేత ఉద్దవ్ టాక్రే చెపుతున్నారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 148  సీట్లు కావలసి ఉంది. కనుక కాంగ్రెస్‌, ఎన్సీపీల మద్దతు కోసం ఉద్దవ్ టాక్రే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ రెండు పార్టీలు తమ బద్దశత్రువైన శివసేనతో చేతులు కలపడానికి అయిష్టంగా ఉన్నాయి. కానీ అవి ఎంతో కాలంగా మహారాష్ట్రలో అధికారం కోసం పడిగాపులు కాస్తున్నందున ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఒకవేళ ఆ రెండు పార్టీలు శివసేనకు మద్దతు ఇవ్వకపోతే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించక తప్పదు. ప్రభుత్వ ఏర్పాటుకు సోమవారం రాత్రి 7.30 గంటల వరకు గడువు విధించినందున ఆలోపుగానే స్పష్టత రావచ్చు.