రాజయ్యా... ఎందయ్యా ఇది?

తెరాస మొదటిసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు తెరాస ఎమ్మెల్యే రాజయ్యకు అనూహ్యంగా కీలకమైన ఉపముఖ్యమంత్రి పదవి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పదువులు లభించాయి. కానీ కొద్ది కాలానికే అవినీతి ఆరోపణలతో రెండు పదవులూ పోగొట్టుకొని 4 ఏళ్ళపాటు రాజకీయ అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. మళ్ళీ ఆయన అదృష్టం కొద్దీ జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి శాసనసభకు పోటీ చేసేందుకు టికెట్ లభించింది. ఆయన అభ్యర్ధిత్వాన్ని తెరాసలోనే చాలామంది వ్యతిరేకించారు కానీ సిఎం కేసీఆర్‌ ఆయనను మార్చలేదు. అది ఆయన అదృష్టమేనని చెప్పవచ్చు. ఈవిధంగా రెండుసార్లు అదృష్టవంతుడిగా నిలిచిన రాజయ్య కనీసం ఇకనైనా పద్దతిగా వ్యవహరిస్తారనుకొంటే మళ్ళీ వార్తాలలోకి ఎక్కారు. 

మూడు రోజులక్రితం జనగామ జిల్లాలో చిలుపూర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు పదవీవిరమణ చేశారు. ఆ కార్యక్రమానికి హాజరైన తెరాస ఎమ్మెల్యే రాజయ్య  భోజన సమయంలో 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్ధిని తనకు అన్నం తినిపించాలని కోరడంతో అందరూ షాక్ అయ్యారు. కానీ ఆయన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో ఆమె అన్నం కలిపి రాజయ్యకు తినిపించింది. ఆమె రాజయ్యకు అన్నం తినిపిస్తుండగా అక్కడున్న ఎవరో మొబైల్ ఫోన్‌తో దానిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో రాజయ్యపై నెటిజన్లు విమర్శలు మొదలుపెట్టారు. 

ఈ విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే రాజయ్య, “నేను ఆమెను అన్నం తినిపించాలని కోరలేదు. ఆమె ముచ్చటపడి నాకు అన్నం తినిపించింది. అన్నం తినిపిస్తానని ఆ బాలిక అడగడంతో కాదనలేక రెండు ముద్దలు తిన్నాను అంతే...వేరే ఉద్దేశ్యంతో కాదు,” అని అన్నారు.