సుప్రీం తీర్పును గౌరవిస్తాం: సున్నీ వక్ఫ్ బోర్డు

అయోధ్య రామజన్మ భూమి, బాబ్రీ మసీదు కేసులో వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సున్నీ వక్ఫ్‌ బోర్డు న్యాయవాది జఫర్‌యాబ్‌ జిలానీ అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ సుప్రీం తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు. తుది తీర్పుపై సున్నీ వక్ఫ్‌ బోర్డు పెద్దలతో చర్చించిన తరువాత తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. 

అయితే సుప్రీం తీర్పు ఏవిధంగా ఉన్నప్పటికీ దానికి ఇరు వర్గాలు కట్టుబడి ఉంటామని ముందే ప్రకటించినందున సున్నీ వక్ఫ్‌ బోర్డు మళ్ళీ అభ్యంతరాలు చెప్పకపోవచ్చునని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. వివాదాస్పద 2.77 ఎకరాల భూమికి బదులుగా మసీదు నిర్మాణానికి 5 ఎకరాలు కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించినందున, మరికొంత ఎక్కువ స్థలం కేటాయించాలనో లేదా తాము కోరుకొన్న ప్రాంతంలోనే స్థలం కేటాయించవలసిందిగానో వక్ఫ్ బోర్డు అభ్యర్ధించవచ్చు. దానికి కేంద్రప్రభుత్వం, యూపీ ప్రభుత్వం కూడా అంగీకరించవచ్చు. 

శతాబ్ధం పైగా సాగిన ఈ వివాదం కారణంగా చెలరేగిన మత ఘర్షణలలో అసలు ఈ సమస్య గురించి ఏమాత్రం తెలియనివారు అనేకమంది తమకు పరిచయమేలేని వారితో ఘర్షణలు పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ వివాదంపై దశాబ్ధాలుగా వివిదకోర్టులలో కొనసాగిన న్యాయవివాదాల కారణంగా న్యాయస్థానాల అమూల్యమైన సమయం వృధా అయ్యింది. దానికోసం వందలకోట్లు ఖర్చు అయ్యాయి. ఈ సమస్యపై సుప్రీంకోర్టు నేడు తీర్పు చెప్పింది కనుక దేశప్రజలు అందరూ దానికి కట్టుబడి ఉండటమే అందరికీ శ్రేయస్కరం. అప్పుడే భారతదేశంలో కోట్లాది హిందూ ముస్లింలు కలిసిమెలిసి జీవిస్తున్నారని ప్రపంచానికి చాటి చెప్పగలుగుతాము.