అయోధ్య హిందువులదే: సుప్రీం తీర్పు

అయోధ్య రామజన్మ భూమి, బాబ్రీ మసీదు వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టు ఈరోజు తుది తీర్పు వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని తీర్పు చెప్పింది. అయితే ఈ భూమిపై యాజమాన్య హక్కులను నిరూపించే ఆధారాలు ఇరువర్గాల వద్ద లేనందున ఎవరూ దానిని తమ సొంత ఆస్తిగా పరిగణించలేరని స్పష్టం చేసింది. పురావస్తుశాఖ నివేదికలు, రెవెన్యూ రికార్డులు, ఇరు మతాల వారి వాదనలు అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని ఈ తీర్పు వెలువరిస్తున్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమికి బదులుగా కేంద్రప్రభుత్వం కానీ యూపీ ప్రభుత్వం గానీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించలని ఆదేశించింది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం 3 నెలలలోగా ఒక ట్రస్టును ఏర్పాటు చేసి దానికి విధివిధానాలను ఖరారు చేయాలని ఆదేశించింది. ఇకపై ఈ 2.77 ఎకరాల భూమి ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే ఉంచాలని ఆదేశించింది.  ఈ తీర్పును చరిత్రకు, రాజకీయాలకు అతీతంగా స్వీకరించాలని సుప్రీంకోర్టు దేశప్రజలకు విజ్ఞప్తి చేసింది.