
టీఎస్ఆర్టీసీ జేఏసీ నేడు తలపెట్టిన ‘ఛలో ట్యాంక్ బండ్’ నిరసన ర్యాలీ పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, దానిని నిర్వహించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు నిర్ణయించడంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఆర్టీసీ జేఏసీ నేతలను, ప్రతిపక్ష నేతలను, ఆర్టీసీ కార్మికులను అరెస్టులు లేదా గృహనిర్బందం చేస్తుండటంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనుంది. పోలీసులు అరెస్ట్ చేయక ముందే ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి, పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు నిన్న రాత్రి నుంచే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. బహుశః వారందరూ రహస్యంగా ట్యాంక్ బండ్ చేరుకొనేందుకు ప్రయత్నిస్తారేమో కానీ పోలీసులు ట్యాంక్ బండ్ రెండు వైపులా మూసివేసినందున అక్కడకు చేరుకోవడం కష్టమే.
ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని విజయవంతంగా జరపాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు పట్టుదలగా ఉంటే, ఎట్టి పరిస్థితులలో జరుపకుండా అడ్డుకోవాలని పోలీసులు కూడా పట్టుదలగా ఉన్నారు. కనుక ట్యాంక్ బండ్ వైపుకు వెళ్ళే అన్ని మార్గాలను మూసివేసి ట్రాఫిక్‌ను వేరే మార్గాలకు మళ్లిస్తున్నారు. ట్యాంక్ బండ్‌కు రెండువైపులా భారీగా పోలీస్‌లను మోహరించారు. సికింద్రాబాద్ నుంచి రాణీ గంజ్, ట్యాంక్ బండ్ వైపు వెళ్ళే అన్ని వాహనదారులను నిలిపి ప్రశ్నించిన తరువాత వదులుతున్నారు. సికింద్రాబాద్ స్టేషన్, నాంపల్లి స్టేషన్, అన్ని మెట్రో స్టేషన్లు, బస్స్టాండ్ల వద్ద పోలీసులు మోహరించి ఆందోళనకారులుగా అనుమానించినవారిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలిస్తున్నారు.
ఈ స్థాయిలో అరెస్టులు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన కారణంగా నేడు ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమం నిర్వహించడం దాదాపు అసంభవంగానే కనిపిస్తోంది. ఆర్టీసీ కార్మిక సంఘాలు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు.