
అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని సజీవదహనం చేసి ఆత్మహత్యాయత్నం చేసిన సురేశ్ పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు ఉస్మానియా ఆసుపత్రి ఆర్‌ఎంఓ రఫీ చెప్పారు. అతను శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్‌పై ఉంచి కృత్రిమశ్వాస అందిస్తున్నామని తెలిపారు. అయితే అతను చనిపోయాడని కానీ ఏవో కారణాల చేత ఆసుపత్రి వైద్యులు ఆ విషయం ప్రకటించకుండా దాచిపెడుతున్నారని ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ స్క్రోలింగ్ చేస్తోంది.
విజయారెడ్డిని ఆమె కార్యాలయంలోనే పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవదహనం చేసిన తరువాత సురేశ్ కూడా ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో అతని శరీరం 65 శాతంపైగా కాలిన గాయాలయ్యాయి. కనుక మరో 72 గంటలు గడిస్తే తప్ప అతని ఆరోగ్య పరిస్థితి గురించి ఏమీ చెప్పలేమని ఉస్మానియా వైద్యులు గురువారమే చెప్పారు. అతనిని వెంటిలేటరుపై ఉంచి చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెపుతున్నారు కనుక ఒకవేళ అతను ఇంకా బ్రతికే ఉన్నా ప్రాణాలతో బయటపడే అవకాశాలు తక్కువేనని అర్ధమవుతోంది. ఈ హత్య కేసులో పోలీసులు అతనిపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు.
తాజా సమాచారం: సురేశ్ గురువారం మధ్యహ్నం 3:30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. వెంటనే పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.
విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన ఆమె డ్రైవర్ గురునాథం అంతక్రియలు నిన్న జరిగాయి.