వంటేరుకు పదవి... థాంక్స్ టు కేసీఆర్‌!

గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధి వంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్ నియోజకవర్గం నుంచి సిఎం కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఎన్నికలలో ఆయన సిఎం కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించడం, తెరాస నేతలు, అధికారులు అందరూ కలిసి వంటేరును తీవ్రంగా ఇబ్బందిపెట్టడం, అందుకు నిరసనగా ఆయన ఎన్నికల అధికారి కార్యాలయం ముందు నిరాహార దీక్షకు కూర్చోవడం వంటి అనేక నాటకీయ పరిణామాలు కూడా జరిగాయి. ఎన్నికలు ముగిసి తెరాస మళ్ళీ అధికారంలోకి రాగానే ఆయన అంతవరకు దూషించిన తెరాసలోనే చేరిపోయి అందరికీ షాక్ ఇచ్చారు.

తెరాసలో చేరినప్పటి నుంచి వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతున్నారు. తెరాసలో చేరేటప్పుడే సముచిత స్థానం, గౌరవం కల్పిస్తామని వంటేరుకు కేటీఆర్‌ హామీ ఇచ్చినందున ఇప్పుడు ఆయనకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ పదవి లభించింది. బుదవారం ఉదయం హైదరాబాద్‌లోని అటవీ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో వంటేరు ప్రతాప్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తనకు ఈ పదవినిచ్చినందుకు ఆయన సిఎం కేసీఆర్‌, అందుకు సహకరించినందుకు తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు, మంత్రి హరీష్‌రావుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.