నవంబర్ 9న ట్యాంక్ బండ్‌పై మిలియన్ మార్చ్

తెలంగాణ ఉద్యమాలు పతాకస్థాయికి చేరుకొన్నప్పుడు ప్రొఫెసర్ కోదండరాం తదితరుల నేతృత్వంలో లక్షలాదిమందితో ట్యాంక్ బండ్‌పై నిర్వహించిన మిలియన్ మార్చ్ తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మళ్ళీ అటువంటి పోరాటాలు అవసరం ఉండకపోవచ్చని అందరూ భావించామని ఆర్టీసీ సమ్మెపై సిఎం కేసీఆర్‌ మొండివైఖరిని నిరసిస్తూ నవంబర్ 9న ట్యాంక్ బండ్‌పై మిలియన్ మార్చ్ నిర్వహించబోతున్నట్లు ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి బుదవారం ప్రకటించారు. కాంగ్రెస్‌, బిజెపి, వామపక్షాలతో సహా రాష్ట్రంలో అన్ని పార్టీలు మిలియన్ మార్చ్ కు మదత్తు ఇస్తున్నాయని అశ్వథామరెడ్డి తెలిపారు. ప్రభుత్వోద్యోగ, ఉపాద్యాయ, కార్మిక సంఘాల మద్దతు కోరుతామని అశ్వథామరెడ్డి చెప్పారు. ఈ మిలియన్ మార్చ్ లో రాష్ట్రంలో అన్ని జిల్లాలలోని ఆర్టీసీ కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

సిఎం కేసీఆర్‌ డెడ్‌లైన్‌ విధించి ఆర్టీసీ కార్మికులను బెదిరించి భయపెట్టాలని ప్రయత్నించినప్పటికీ ఎవరూ భయపడలేదని అందరూ కలిసికట్టుగా పోరాడుతున్నారని అందుకు ఆర్టీసీ కార్మికులందరికీ అశ్వధామరెడ్డి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆర్టీసీలో 31 శాతం కేంద్రప్రభుత్వం వాటా ఉన్నప్పుడు కేంద్రం అనుమతి లేకుండా ఆర్టీసీని ప్రయివేటీకరణ చేయలేరని, ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాలలో నుంచి తొలగించే హక్కు ఆయనకు లేదన్నారు. కనుక ఆర్టీసీ కార్మికులు ఎవరూ కేసీఆర్‌ బెదిరింపులకు భయపడనవసరం లేదని ఆర్టీసీని కాపాడుకొనేందుకు పోరాటం కొనసాగిద్దామని అశ్వధామరెడ్డి అని అన్నారు.