
కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకత ఏమిటంటే అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీలో నేతలు పదవుల కోసం కీచులాడుకొంటూనే ఉంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండవసారి కూడా అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయి, 11 మంది ఎమ్మెల్యేలు తెరాసలోకి వెళ్ళిపోయినప్పటికీ పార్టీలో నేతల తీరు ఏమాత్రం మారలేదు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీకాలం పూర్తయి చాలాకాలం అయినందున ఆ పదవి కోసం సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ పోటీ పడుతున్నారు.
కాంగ్రెస్ అధిష్టానం తరపున సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మంగళవారం హైదరాబాద్ వచ్చినప్పుడు, షబ్బీర్ అలీ, వి.హనుమంతరావు ఆయన ఎదుటే గాంధీభవన్‌లో ఒకరినొకరు ఘాటుగా తిట్టుకొనడంతో ఆజాద్ షాక్ అయ్యారు. ఇటువంటి పరిస్థితిని ఊహించని ఆజాద్ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు కానీ వి.హనుమంతరావు ఆగ్రహంతో సమావేశం మద్యలో లేచి వెళ్ళిపోయారు. లోపల వారిరువురూ గొడవ పడుతుంటే బయట కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుచరులు నినాదాలతో హోరెత్తించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికే పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇంకా రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క తదితరులు కూడా పిసిసి అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వారు కూడా బరిలో దిగితే ఏమయ్యుండేదో?