
టీఎస్ఆర్టీసీలో మరణ మృదంగం మ్రోగుతూనే ఉంది.వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఆర్టీసీ కండెక్టర్ ఎరుకొండ రవీందర్ (52), నల్గొండ జిల్లా దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ తుమ్మలపల్లి జైపాల్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఆర్టీసీ సమ్మెపై నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో తీవ్ర ఆందోళనకు, ఒత్తిడికి గురవుతున్న ఆర్టీసీ కార్మికులు వరుసగా గుండెపోటుతో మరణిస్తున్నారు.
అక్టోబర్ 5న ఆర్టీసీ సమ్మె మొదలైంది. ఈ నెల రోజుల సమ్మెలో ఇప్పటి వరకు సుమారు 17 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయారు. ‘బుద్దిగా పనిచేసుకొంటున్న ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టి సమ్మెలో దింపిన ఆర్టీసీ యూనియన్ నేతలు, ప్రతిపక్షాలే వారి మరణాలకు బాధ్యులని’ సిఎం కేసీఆర్ వాదిస్తుంటే, ‘ఆర్టీసీ ఆస్తులను అమ్మేసుకోవాలనే దురుదేశ్యంతో చర్చలు జరుపకుండా సమ్మెను కొనసాగేలా చేస్తున్న సిఎం కేసీఆరే వారి మరణాలకు బాధ్యుడు’ అని ఆర్టీసీ కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి. ఈవిధంగా పరస్పరం నిందించుకొంటుండగానే రోజులు గడిచిపోతున్నాయి. ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ ఆర్టీసీ కార్మికుల కుటుంబాల ఆర్ధిక పరిస్థితి దయనీయంగా మారుతోంది. మరో పక్క ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం కళ్ల ముందు కదలాడుతుంటే ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళన, ఒత్తిడికి గురై ప్రాణాలు పోగొట్టుకొంటున్నారు.
ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించిన డ్రైవర్ తుమ్మలపల్లి జైపాల్ రెడ్డి మరో ఆరు నెలలో రిటైర్ కావలసి ఉంది. జీవితమంతా కష్టపడిన డ్రైవర్ జైపాల్ రెడ్డి రిటైర్ అయ్యి ఇక ప్రశాంతంగా శేషజీవితం గడుపవలసిన సమయంలో ఆర్టీసీ సమ్మెపై ఏర్పడిన ప్రతిష్టంభన కారణంగా గుండెపోటుతో అర్ధాంతరంగా చనిపోయారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇప్పుడు వారిని ప్రభుత్వం ఆదుకొంటుందా? సమ్మెకు పిలిపునిచ్చిన ఆర్టీసీ జేఏసీ నేతలు ఆదుకోగలరా లేక సమ్మెకు మద్దతు ఇస్తున్న ప్రతిపక్షాలు ఆదుకొంటాయా? చనిపోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను ఎవరూ ఆదుకోకపోతే వారి పరిస్థితి ఏమిటి?