అమిత్ షాకు ఫిర్యాదు చేస్తాం: అశ్వధామరెడ్డి

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిలో ఎటువంటి మార్పు కనబడకపోవడంతో ఆర్టీసీ జేఏసీ నేతలు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో విద్యానగర్‌ వద్ద గల యూనియన్ కార్యాలయంలో సమావేశమయ్యి తాజా పరిస్థితులపై చర్చించి సమ్మెను కొనసాగించాలని నిర్ణయించారు. 

అనంతరం అశ్వధామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం చాలా మొండివైఖరితో వ్యవహరిస్తోంది. కనుక మా సమస్యలు పరిష్కారం అయ్యేవరకు సమ్మెను కొనసాగించాలని నిర్ణయించాము. ఏపీ, తెలంగాణ ఆర్టీసీ విభజన ఇంకా పూర్తికాలేదు. కనుక మేము ఇంకా ఏపీఎస్ ఆర్టీసీలోనే ఉన్నట్లే లెక్క. ఆర్టీసీ విభజన పూర్తికాలేదు కనుక దానిపై సిఎం కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేరు. కనుక సిఎం కేసీఆర్‌, మంత్రుల బెదిరింపులకు భయపడవద్దని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈనెల 4, 5 తేదీలలో మేము డిల్లీకి వెళ్ళి కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిసి పరిస్థితులు వివరించి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని మన సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతాము,” అని చెప్పారు. రేపటి నుంచి ఆర్టీసీ సమ్మెకు కార్యాచరణను అశ్వధామరెడ్డి ప్రకటించారు. 

నవంబర్3: రాష్ట్రంలో అన్ని డిపోల వద్ద, గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేసి ఆర్టీసీ సమస్యలను ప్రజలకు వివరించడం. 

నవంబర్ 4: రాజకీయ పార్టీలతో కలిసి డిపోల వద్ద దీక్షలు

నవంబర్ 5: సడక్ బంద్‌ (రహదారుల దిగ్బందం)

నవంబర్ 6: డిపోల ముందు నిరసనలు 

నవంబర్ 7: ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు, రాజకీయపార్టీల నేతలతో కలిసి డిపోల ముందు దీక్షలు 

నవంబర్ 8: ఛలో ట్యాంక్ బండ్ సన్నాహాలు 

నవంబర్ 9: ట్యాంక్ బండ్‌పై దీక్షలు, నిరసన కార్యక్రమాలు