హక్కుల కోసం ఇంకా పోరాడవలసివస్తోంది: కె.లక్ష్మణ్‌

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ సిఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణలో పోలీసులతో రాజ్యం నడిపిస్తూ సిఎం కేసీఆర్‌ నయా నిజాం నవాబులా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా ఇంకా హక్కుల కోసం పోరాడవలసి వస్తుండటం చాలా బాధాకరం. సిఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించకుండా వారిని మరింత రెచ్చగొట్టేవిధంగా వ్యవహరిస్తున్నారు. ఏదోవిధంగా ఆర్టీసీ కార్మికులను బయటకు వెల్లగొట్టి ఆర్టీసీ ఆస్తులను దోచుకోవాలని చూస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల ఆగ్రహానికి గురైన సిఎం కేసీఆర్‌కు సమ్మెతోనే పతనం ప్రారంభం అయింది. ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు ప్రభుత్వానికి ఎన్ని మొట్టికాయలు వేస్తున్నా సిఎం కేసీఆర్‌లో చలనం లేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆర్టీసీ సమ్మె, తెలంగాణలో పరిస్థితులపై నేను మా పార్టీ అధిష్టానానికి నివేదిక ఇచ్చాను. కరీంనగర్‌లో మా ఎంపీ బండి సంజయ్‌పై పోలీసుల దౌర్జన్యం చేయడాన్ని మా పార్టీ తీవ్రంగా పరిగనిస్తోంది. ఖండిస్తోంది. బాధ్యులైన అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను.