ఆర్టీసీ డిపోల వద్ద 24 గంటలు దీక్షలు

ఆర్టీసీ సమ్మెలో భాగంగా గురువారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో అన్ని ఆర్టీసీ డిపోలా వద్ద ఆర్టీసీ కార్మికులు 24 గంటలపాటు దీక్షలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు వారికి సంఘీభావం తెలిపాయి. 

సరూర్‌నగర్‌లో బుదవారం సాయంత్రం జరిగిన సకలజనుల సమరభేరి బహిరంగసభలో ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి మాట్లాడుతూ, “మావంటి కొందరు యూనియన్ నేతల కారణంగానే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారని ఆరోపిస్తూ ఆర్టీసీ కార్మికులలో చీలిక తెచ్చి సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి సిఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి చేస్తున్న పోరాటంలో మావంటివారు ఉడతాభక్తిగా సేవ చేస్తున్నామే తప్ప ఎవరినీ రెచ్చగొట్టడంలేదు. అందుకే 26 రోజులుగా సమ్మె జరుగుతున్నా... సెప్టెంబర్ జీతాలు చెల్లించకపోయినా ఆర్టీసీ కార్మికులు సంయమనం కోల్పోలేదు...శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్దంగా సమ్మె చేస్తున్నారు. 

సిఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులను, హైకోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదు. సమ్మె చట్టబద్దమేనాని హైకోర్టు స్వయంగా చెప్పినా సిఎం కేసీఆర్‌ మాత్రం సమ్మె చట్ట వ్యతిరేకమని ఇంకా వాదిస్తునే ఉన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను, కార్మికులను బెదిరించి, భయపట్టి సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నించే బదులు మా సమస్యలను, డిమాండ్లను పరిష్కరించి సమ్మెను ముగింపజేయవచ్చు కదా? 

రాష్ట్రంలో ప్రతిపక్షాలతో సహా అన్ని వర్గాల ప్రజలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇస్తున్నారు. కొందరు తెరాస ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇస్తున్నారు కానీ ధైర్యంగా బయటకు చెప్పలేకపోతున్నారు. ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్ళు చేసినా మేము వెనకడుగు వేయబోము. మా సమస్యలన్నీ పరిష్కారం అయ్యేవరకు మా పోరాటాలు కొనసాగిస్తాము. మనమందరం కలిసికట్టుగా ప్రభుత్వంతో పోరాడితే తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం నాకుంది. కనుక ఎవరూ ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆర్టీసీ కార్మిక మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. గురువారం మధ్యాహ్నం నుంచి 24 గంటల పాటు జరుగబోయే ఆర్టీసీ కార్మికులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.