సిపిఐ జాతీయనేత గురుదాస్ గుప్తా మృతి

సిపిఐ జాతీయనేత, మాజీ ఎంపీ గురుదాస్ దాస్‌గుప్తా (83) గురువారం ఉదయం కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా గుండె, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. గురుదాస్ గుప్తా దేశంలో కార్మిక సంఘాల తరపున ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కార్యదర్శిగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలతో అనేక పోరాటాలు చేశారు. అనేకసార్లు జైలుకు వెళ్లారు. 2004లో సిపిఐ జాతీయ కార్యవర్గంలో సభ్యుడిగా, ఆ తరువాత డెప్యూటీ జనరల్ సెక్రెటరీగా పనిచేశారు. గురుదాస్ దాస్‌గుప్తా 1985 నుంచి 2009 వరకు సుమారు 25 సం.ల పాటు లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని పార్లమెంటులో గట్టిగా నిలదీసేవారు.

ఆర్ధిక, రాజకీయ, సామాజిక, పారిశ్రామిక తదితర రంగాలకు సంబందించిన అంశాలపై మంచి పట్టున్న గురుదాస్ గుప్తా వాటిపై పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు చురుకుగా పాల్గొని కేంద్రప్రభుత్వానికి చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చేవారు. మంచి పార్లమెంటేరియన్‌గా, మంచి మనసున్న కార్మికనేతగా గురుదాస్ దాస్‌గుప్తా పేరు సంపాదించుకొన్నారు. ఆయన మృతిపట్ల ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్‌, ప్రతిపక్ష నేతలు సంతాపం తెలుపుతున్నారు.