నిర్బందాల తెలంగాణ కోసమే పోరాడామా?రేవంత్ రెడ్డి

సరూర్‌నగర్‌ ఇండోర్ స్టేడియంలో బుదవారం సాయంత్రం నిర్వహించిన సకలజనుల సమరభేరి బహిరంగసభకు రాష్ట్రం నలుమూలల నుంచి ఆర్టీసీ కార్మికులు తరలివచ్చారు. ఈ సభలో ప్రతిపక్ష పార్టీలు, ఎంఆర్పీఎస్, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

సభలో పాల్గొన్న కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి ఆర్టీసీ కార్మికులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మా మ్యానిఫెస్టోలో హామీ ఇవ్వలేదు కనుక విలీనం చేయమని వితండవాదం చేస్తున్న సిఎం కేసీఆర్‌, మ్యానిఫెస్టోలో లేనివి కూడా అనేకం అమలుచేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటుంటారు కదా? మీ కుటుంబ సభ్యులను మంత్రులు, ఎంపీలు చేస్తానని మ్యానిఫెస్టోలో పెట్టారా? కానీ వారందరికీ పదవులు పంచిపెట్టుకొన్నారు కదా? వేలాదిమంది ఆర్టీసీ కార్మికులు కోరుతుంటే ఎందుకు విలీనం చేయరు? వారు తెలంగాణ ప్రజలు కాదా? వారు మీకు ఓట్లు వేసి గెలిపించలేదా? ఒకప్పుడు ఏ సమస్యకైనా తెలంగాణ సాధనే పరిష్కారం అని పదేపదే చెప్పేవారు. కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం 25 రోజులుగా రోడ్లెక్కి సమ్మె చేస్తున్నా ఎందుకు పరిష్కరించడం లేదు? ఆర్టీసీ కార్మికులు సభ పెట్టుకోవడానికి ఎందుకు అనుమతించలేదు? ఇటువంటి నిర్బందపాలన కోసమేనా మనం కోట్లాడి తెలంగాణ సాధించుకొన్నది? ఆర్టీసీ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి తెరాస సర్కార్ ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ అందరూ కలిసికట్టుగా నిలబడి పోరాడుతున్నారు. ఇదే స్పూర్తితో మీ పోరాటం కొనసాగిస్తే సిఎం కేసీఆర్‌ తప్పకుండా దిగివస్తారు,” అని అన్నారు.