
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరత్ అరవింద్ బాబ్డే (63) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్యకార్యదర్శి పికే మిశ్రా స్వయంగా జస్టిస్ బాబ్డే కార్యాలయానికి వెళ్ళి నియామక ఉత్తర్వులను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేస్తున్న జస్టిస్ రంజన్ గగోయ్ పదవీకాలం నవంబర్ 17తో ముగియనుంది. కనుక నవంబర్ 18వ తేదీన జస్టిస్ బాబ్డే సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేస్తారు. జస్టిస్ బాబ్డే 17 నెలల పాటు అంటే 2021 ఏప్రిల్ 23వరకు పదవిలో కొనసాగుతారు.
మహారాష్ట్రకు చెందిన జస్టిస్ బాబ్డే నాగపూర్లో 1956లో జన్మించారు. ఆయన తండ్రి, సోదరుడు కూడా న్యాయవాదులుగానే పనిచేశారు. జస్టిస్ బాబ్డే మొదట బాంబే హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టి 2000లో బాంబే హైకోర్టులో అధనపు న్యాయమూర్తిగా, 2012లో మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసి, 2013లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అంచెలంచెలుగా ఎదుగుతూ త్వరలో అత్యున్నతమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని కూడా చేపట్టబోతున్నారు.