ఆర్టీసీ కార్మిక సంఘాలు బుదవారం సాయంత్రం సరూర్‌నగర్‌లో సకలజనుల సమరభేరి పేరిట బహిరంగసభను నిర్వహించబోతున్నాయి. కార్మిక సంఘాలు సరూర్‌నగర్‌లో మైదానంలో 3 లక్షల మందితో బహిరంగసభను నిర్వహించాలనుకొన్నాయి కానీ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సభను నిర్వహించుకోవలసిందిగా హైకోర్టు సూచించింది. అది కేవలం 5,000 మందికి మాత్రమే సరిపోతుంది కనుక ఈరోజు జరుగబోయే సభకు ఆర్టీసీ కార్మికులందరూ పాల్గొనలేని పరిస్థితి ఏర్పడింది. అన్ని జిల్లాల నుంచి ఆర్టీసీ ముఖ్యనేతలు, పరిమిత సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు, ప్రతిపక్ష నేతలు మాత్రమే ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది.
తమ సకలజనుల సమరభేరిని ప్రభుత్వం అడ్డుకోలేకపోయినందుకు ఆర్టీసీ కార్మిక సంఘాలు సంతోషించాయి కానీ ఈవిధంగా సభను కుదించుకోవలసిరావడంతో తమ పోరాటంపై నీళ్ళు జల్లినట్లయిందని వారు ఆవేదన చెందుతున్నారు. అయినప్పటికీ నేటి సభతో తమ పోరాటాలను మరింత ఉదృతం చేస్తామని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి చెపుతున్నారు.
ఆర్టీసీ సమ్మెపై అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాలు పట్టువీడకుండా తదుపరి కార్యాచరణ గురించే ఆలోచిస్తుండటంతో సమస్య నానాటికీ మరింత జటిలంగా మారుతోంది. ఈ కారణంగా రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రోజురోజుకూ మరణిస్తున్న ఆర్టీసీ కార్మికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ సమస్యకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుందో తెలియని పరిస్థితులు నెలకొనున్నాయి.