
సమైక్య రాష్ట్రంలో ఏటా నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావదినోత్సవ వేడుకలు జరిపేవారు. కానీ రాష్ట్ర విభజన తరువాత జూన్ 2న ఆంధ్ర, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడటంతో ఆరోజున తెలంగాణ ఆవిర్భావదినోత్సవ వేడుకలు జరుపుకొంటున్నాము.
కానీ రాష్ట్ర విభజన కారణంగా ఏపీ అన్ని విధాల తీవ్రంగా నష్టపోయినందున జూన్ 2ను ఒక చేదు జ్ఞాపకంగా భావిస్తూ ఆరోజున రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ వేడుకలు జరుపుకోకూడదని గతంలో అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవలసి వచ్చినందున ఆ లక్ష్యాలను గుర్తు చేసుకొంటూ ‘నవనిర్మాణ దీక్షలు’ పేరిట సభలు, సమావేశాలు టిడిపి ప్రభుత్వం నిర్వహిస్తుండేది. టిడిపి ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినప్పటికీ గత 5 ఏళ్లుగా రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ వేడుకలు జరుపలేదు.
కానీ జగన్ ప్రభుత్వం ఇక నుంచి ఏటా నవంబర్ 1వ తేదీన రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం నవంబర్ 1న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ వేడుకలు జరుపబోతోంది.
గతంలో సమైక్య రాష్ట్రం నవంబర్ 1న ఏర్పడింది కనుక ఆరోజున రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ వేడుకలు జరిగేవి. కానీ రాష్ట్ర విభజన తరువాత జూన్ 2న ఏపీ, తెలంగాణలు వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పడినందున ఏపీ ప్రభుత్వం కూడా ఆదేరోజున రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ వేడుకలు జరుపదలిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ నవంబర్ 1న ఏపీ రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించడంతో మళ్ళీ ఇది కూడా మరో కొత్త వివాదంగా మారే అవకాశం ఉంది.