
టిఎస్ఆర్టీసీ సమ్మె విషయంలో సిఎం కేసీఆర్ వైఖరి, నిర్ణయాల వలన ప్రభుత్వం తరపువాదిస్తున్న అడ్వకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ హైకోర్టు చేత పదేపదే చివాట్లు తినవలసివస్తుండటం విశేషం. టీఎస్ఆర్టీసీకి జీహెచ్ఎంసీ, ప్రభుత్వం ఎంత బకాయిలు చెల్లించవలసి ఉంది?దానిపై ప్రభుత్వం ఉద్దేశ్యం ఏమిటి? అనే ప్రశ్నలకు సూటిగా సమాధానాలతో నేడు విచారణకు హాజరుకావాలని హైకోర్టు నిన్న ఏజీని ఆదేశించడంతో, మంగళవారం మధ్యాహ్నం సిఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో దీనిపై అత్యవసర సమావేశం నిర్వహించి, హైకోర్టుకు సమర్పించవలసిన నివేదికను సిద్దం చేసి ఇచ్చారు. ఏజీ దానిని ఈరోజు హైకోర్టుకు సమర్పించారు.
ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలు వివరాలను తాము కోరితే, ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించిన సొమ్ము గురించి, రాష్ట్ర విభజనలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 52:48 నిష్పత్తిలో బకాయిలు చెల్లించవలసి ఉందని, ప్రస్తుతం ఆ అంశం కేంద్రం పరిధిలో ఉందని నివేదికలో పేర్కొనడంపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ఆర్ధికశాఖ అధికారులు అతితెలివి ప్రదర్శిస్తూ కోర్టును మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదున్నరేళ్ళ క్రితం రాష్ట్ర విభజన జరిగితే ఇంతవరకు ఆర్టీసీ ఆస్తులు, అప్పుల వ్యవహారం ఎందుకు పరిష్కరించుకోలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలపై కోర్టుకు సూటిగా సమాధానం చెప్పాలని న్యాయమూర్తి ఏజీని నిలదీశారు.
ఈనెల 31లోగా ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలపై హైకోర్టుకు పూర్తి నివేదిక సమర్పించాలని ఆర్టీసీ ఇన్-ఛార్జ్ ఎండీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 1వ తేదీకి వాయిదా వేస్తూ ఆరోజున ఆర్టీసీ ఆర్ధిక వ్యవహారాలను చూస్తున్న ఉన్నతాధికారి కోర్టుకు హాజరవ్వలని ఆదేశించింది.