
ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు బుదవారం సరూర్‌నగర్‌లో సకలజనుల సమరభేరి పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించాలనుకొన్నారు. ఆ సభకు ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి. కానీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆర్టీసీ జేఏసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను ప్రభుత్వానికి, ప్రజలకు చెప్పుకోవడానికి బహిరంగసభ నిర్వహించుకోవడానికి కూడా వీలులేదా? ఈ నిర్బందాలతో మా గొంతులను అణచివేయగలమనే ప్రభుత్వం భావిస్తోందా? ఒకవేళ ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము,” అని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి అన్నారు.
చెప్పినట్లుగానే ఆర్టీసీ కార్మిక సంఘాలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశాయి. భోజన విరామం తరువాత దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు మళ్ళీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. కార్మికులు సభ జరుపుకొంటామంటే ప్రభుత్వానికి అభ్యంతరం ఏమిటి? సభకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు? అసలు ప్రభుత్వం ఉద్దేశ్యం ఏమిటి? సాయంత్రం 4 గంటలలోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.