ఆర్టీసీపై కేసీఆర్‌ సమీక్షా సమావేశం

ప్రభుత్వం నియమించిన కమిటీ-ఆర్టీసీ జేఏసీ నేతల మద్య శనివారం మధ్యాహ్నం జరిగిన చర్చలు విఫలం అవడంతో సిఎం కేసీఆర్‌ నిన్న ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టులో మళ్ళీ విచారణ జరుగనుంది. దానిలో ప్రభుత్వం హైకోర్టుకు సమాధానం చెప్పవలసి ఉన్నందున సమావేశంలో పాల్గొన్న రవాణామంత్రి పువ్వాడ అజయ్‌, ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ, ఈడీలతో సిఎం కేసీఆర్‌ చర్చించి వారికి తగిన సూచనలు చేశారు. 

కోర్టు ఆదేశాల మేరకు సమ్మెను ముగించేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలకు ప్రభుత్వం సిద్దపడినప్పటికీ వారు సమావేశం నుంచి మద్యలో లేచి వెళ్ళిపోయినందున చర్చలు విఫలమయ్యాయని, కనుక ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం తీసుకొంటున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి హైకోర్టుకు నివేదించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

ఈ సమావేశంలో అద్దె బస్సుల సంఖ్యను భారీగా పెంచాలని, ప్రైవేట్ ఆపరేటర్లకు ఏఏ మార్గాలను కేటాయించాలనే దానిపై సర్వే నిర్వహించి, అందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించవలసిందిగా సిఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు సమాచారం. 

చర్చలు విఫలం అవడంతో నేటి నుంచి ఆర్టీసీ సమ్మెను మరింత ఉదృతం చేయాలని ఆర్టీసీ జేఏసీ నేతలు నిర్ణయించారు. ఈ నెల 30న సరూర్‌నగర్‌లో సకల జనుల సమరభేరి సభను నిర్వహించడానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు. 

అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు కూడా పట్టువీడకపోవడంతో ఇప్పుడు ఈ సమస్యను హైకోర్టు పరిష్కరించవలసి ఉంటుంది. ఒకవేళ హైకోర్టు కూడా పరిష్కరించలేకపోతే అప్పుడు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ జోక్యం చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.