ఆర్టీసీ చర్చలు విఫలం

ప్రభుత్వం నియమించిన టి.వెంకటేశ్వరరావు కమిటీ సభ్యులు-ఆర్టీసీ జేఏసీ నేతలు శనివారం మధ్యాహ్నం ఎర్రమంజిల్‌లోని ఈఎన్‌సీ భవనంలో భేటీ అయ్యారు. కానీ ఇరువర్గాలు ముందే సొంత అజెండాలతో వచ్చినందున చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి.  

సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి, కోకన్వీనర్లు రాజిరెడ్డి,వాసుదేవరావు, వీఎస్ రావు సమావేశమందిరంలో ప్రవేశించగానే భద్రతా సిబ్బంది వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొనే ప్రయత్నం చేయడం, అందుకు వారు నిరాకరించడంతో సమావేశం మొదలుకాక మునుపే ఘర్షణ వాతావరణం ఏర్పడింది. చివరికి వారు ఫోన్లుస్విచ్చాఫ్ చేసిన తరువాత చర్చలు మొదలయ్యాయి. కానీ ఆ తరువాత ఏఏ అంశాలపై చర్చలు జరపాలనే దానిపై ఇరువర్గాల మద్య వాదోపవాదాలు జరగడంతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశంలో నుంచి అర్ధాంతరంగా బయటకు వచ్చేశారు. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధానడిమాండ్‌, ఆర్ధిక అంశాలతో కూడిన డిమాండ్లు తప్ప మిగిలినవాటిపై మాత్రమే చర్చిస్తామని కమిటీ సభ్యులు పట్టుబట్టారు. కానీ అన్ని డిమాండ్లపై చర్చ జరగాలని ఆర్టీసీ జేఏసీ నేతలు పట్టుపట్టారు. ఏఏ అంశాలపై చర్చించాలనే విషయంలోనే అంగీకారం కుదరకపోవడంతో చర్చలు మొదలవకుండానే ముగిసిపోయాయి.