
టిఎస్ఆర్టీసీ కార్మికులతో చర్చించి సమ్మె ముగించి ఈనెల 28న జరిగే విచారణకు ఆ సమాచారంతో రావాలని హైకోర్టు సూచనపై స్పందించిన తెరాస సర్కార్, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.వేంకటేశ్వరరావు నేతృత్వంలో ఈడీలతో ఒక కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఆ కమిటీ సమర్పించిన నివేదికపై సిఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో వారితో సుదీర్గంగా చర్చించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్, మరో 9 డిమాండ్లు మినహా మిగిలిన 12 డిమాండ్లపై సిఎం కేసీఆర్ సానుకూలంగా స్పదించినట్లు సమాచారం. కనుక నేడు ఎర్రమంజిల్లో ఆర్టీసీ జేఏసీ నేతలతో ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ కాబోతోందని సమాచారం.
ప్రభుత్వంపై ఆర్ధికభారంపడని డిమాండ్లను మాత్రమే ఆమోదించి, మిగిలినవాటిపై ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చించి వారి అభిప్రాయాలను సిఎం కేసీఆర్కు తెలియజేయబోతున్నట్లు సమాచారం. ఒకవేళ చర్చలకు పిలిస్తే తప్పక హాజరవుతామని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి తెలిపారు. కానీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని వాటికి అంగీకరించమని ఒత్తిడి చేస్తే ఒప్పుకోమని ముందే చెప్పారు.
ఈసారికూడా స్వయంగా నిర్ణయాలు తీసుకోలేని ఉన్నతాధికారుల కమిటీయే చర్చలకు వస్తోంది కనుక చర్చలు ఫలిస్తాయనుకోలేము. కానీ ప్రభుత్వ వైఖరితో తీవ్ర ఆందోళన, ఒత్తిడికి గురవుతున్న ఆర్టీసీ కార్మికులు రాజీపడినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ఈరోజు జరుగబోయే చర్చలు ఫలించి ప్రభుత్వం రేపటిలోగా సెప్టెంబర్ నెల జీతాలు విడుదల చేస్తే ఆర్టీసీ కార్మికులు రేపు దీపావళి పండుగ చేసుకోగలుగుతారు లేకుంటే కష్టమే.