11.jpg)
ఉపఎన్నికలలో తెరాస అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డిని గెలిపించినందుకు నియోజకవర్గంలోని ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు సిఎం కేసీఆర్ శనివారం హుజూర్‌నగర్‌లో బహిరంగసభ నిర్వహించనున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి, స్థానిక తెరాస నేతలు బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కంచుకోటగా భావిస్తున్న హుజూర్‌నగర్‌ను తెరాసకు అప్పగించినందుకు సిఎం కేసీఆర్ నియోజకవర్గం ప్రజలకు వరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఆర్టీసీ సమ్మెపై సిఎం కేసీఆర్ ఇప్పటికే తన వైఖరిని నిన్న విస్పష్టంగా చెప్పారు. ఆర్టీసీ కార్మికుల 21 డిమాండ్లపై టి. వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ నేడు సిఎం కేసీఆర్‌కు నివేదికను అందజేయబోతోంది. కనుక దాని ఆధారంగా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై సిఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. అదే విషయం రేపు హుజూర్‌నగర్‌లో సభలో ప్రజలకు తెలియజేసి ఆర్టీసీ సమ్మెపై తన వైఖరిని సమర్ధించుకొనే ప్రయత్నం చేయవచ్చు. ఆర్టీసీ సమ్మెపై సిఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ ఆర్టీసీ జేఏసీ, ప్రతిపక్షాల నేతలు తీవ్ర విమర్శలు చేసినందున వాటికీ సిఎం కేసీఆర్ రేపటి సభలో సమాధానాలు చెప్పవచ్చు.
అయితే చిరకాలంగా కాంగ్రెస్ చేతిలో ఉన్న హుజూర్నగర్ నియోజకవర్గం ఇప్పుడు అధికార తెరాస చేతిలోకి వచ్చింది కనుక తెరాస సర్కార్ దానిని ఏవిధంగా అభివృద్ధి చేయబోతోందో సిఎం కేసీఆర్ నోట వినాలని నియోజకవర్గం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.