మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి తిరుగులేని విజయం సాధిస్తుందని సర్వేలన్నీ జోస్యం చెప్పాయి. మహారాష్ట్రలో వాటి జోస్యం ఫలించింది కానీ హర్యానాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకోవడంతో అక్కడ హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.
హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉన్నందున ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ 46 అవుతుంది. ఇప్పటి వరకు పూర్తయిన లెక్కింపులో బిజెపి 18 స్థానాలు గెలుచుకొని మరో 18 స్థానాలలో ఆదిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలు గెలుచుకొని 22 స్థానాలలో అదిక్యంలో ఉంది. ఇక జేజేపి 5 స్థానాలలో గెలిచి మరో 5 స్థానాలలో ఆదిక్యతలో ఉంది. ఇతరులు 2 సీట్లు గెలుచుకొని మరో 8 స్థానాలలో ఆదిక్యంలో ఉన్నారు.
కనుక కాంగ్రెస్, బిజెపిలు రెండూ కూడా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేయలేవని స్పష్టం అవుతోంది. కనుక జేజేపి, స్వతంత్ర అభ్యర్ధులను తమ వైపు తిప్పుకోవడానికి రెండు పార్టీలు అప్పుడే తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈసారి హర్యానాలో బిజెపి అధికారంలోకి రానీయకూడదని హర్యానా మాజీ సిఎం భూపేందర్ సింగ్ హుడా చాలా పట్టుదలగా ఉన్నారు. కనుక జేజేపి అధినేత దుష్యంత్ చౌతాలాకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేస్తున్నట్లు తాజా సమాచారం. తద్వారా కర్ణాటక తరహాలో బిజెపిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
ఒకవేళ అదేజరిగితే అప్పుడు బిజెపి కూడా కర్ణాటక తరహాలోనే కాంగ్రెస్, జేజేపి కూటమిలో ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోనో లేదా వారిచేత రాజీనామాలు చేయించో కాంగ్రెస్-జేజేపి సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారం చేజిక్కించుకోవడం ఖాయమేనని భావించవచ్చు.
హర్యానాలో ఏర్పడిన ఈ తాజా పరిస్థితులు దుష్యంత్ చౌతాలాను కింగ్ మేకర్‌గా మార్చడంతో ఆయన అప్పుడే చెట్టెక్కి కూర్చోన్నట్లు తెలుస్తోంది. తనకు ఏ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఇస్తే దానితోనే చేతులు కలుపుతానని చెపుతున్నట్లు తాజా సమాచారం.