హుజూర్‌నగర్‌లో కౌంటింగ్ షురూ

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్ర అసెంబ్లీలతో పాటు వివిద రాష్ట్రాలలో 51 అసెంబ్లీ స్థానాలకు, 2 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 21న జరిగిన ఎన్నికలకు నేడు ఫలితాలు వెలువడనున్నాయి. ఈరోజు ఉదయం 8 గంటలకు అన్నిచోట్ల ఒకేసారి కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. 

హుజూర్‌నగర్‌ స్థానానికి జరిగిన ఉపఎన్నికలకు సంబందించి కౌంటింగ్ ప్రక్రియ సూర్యపేట మార్కెట్ యార్డులో జరుగుతోంది. నిబందనల ప్రకారం మొదట పోస్టల్ ఓట్లను లెక్కించిన తరువాత ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఎప్పటికప్పుడు ఫలితాలు ప్రకటిస్తుంటారు. 

హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ తెరాసతో తీవ్రంగా పోటీపడినప్పటికీ, రాష్ట్రంలో మరో నాలుగున్నరేళ్ళు తెరాసయే అధికారంలో ఉంటుంది కనుక తెరాస అభ్యర్ధి సైదిరెడ్డిని గెలిపించుకుంటేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావించే అవకాశం ఉంది కనుక ఈ ఉపఎన్నికలలో తెరాస విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరికొద్ది సేపటిలో ఎలాగూ ఫలితాలు వెలువడనున్నాయి కనుక హుజూర్‌నగర్‌లో ఎవరు గెలుస్తారో తేలిపోనుంది. 

మహారాష్ట్ర, హరియాణ రాష్ట్రాలలో బిజెపి భారీ మెజార్టీతో విజయం సాధించబోతోందని సర్వేలు చెప్పాయి. వాటి జోస్యం ఫలిస్తుందో లేదో కూడా మరికొన్ని గంటలలో తేలిపోతుంది.